



Best Web Hosting Provider In India 2024
Srikakulam Crime : ఇంత తెగింపా.. హాస్టల్‌లోకి చొరబడి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం.. సిబ్బంది ఏం చేస్తున్నారు?
Srikakulam Crime : శ్రీకాకుళంలో ఘోరమైన ఘటన జరిగింది. హాస్టల్‌లోకి చొరబడి డిగ్రీ విద్యార్థినిపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన శ్రీకాకుళంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల హాస్టల్‌లోకి గుర్తు తెలియని దుండగులు రాత్రి వేళలో ప్రవేశించారు. బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై.. హాస్టల్ ప్రాంగణంలోనే దారుణానికి ఒడిగట్టారు. విద్యార్థినిపై అత్యాచారం చేసి, అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు అఘాయిత్యానికి పాల్పడటంతో.. విద్యార్థిని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది.

రిమ్స్‌కు తరలింపు..
తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలో స్నేహితురాలు ఉండటాన్ని తోటి విద్యార్థినులు గమనించారు. హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. బాధితురాలిని హుటాహుటిన శ్రీకాకుళంలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హాస్టల్‌లోకి ప్రవేశించిన వ్యక్తులు ఎవరు? వారు ఎలా హాస్టల్‌లోకి ప్రవేశించారు? వారికి ఎవరైనా సహాయం చేశారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
సిబ్బంది ఏం చేస్తున్నారు..
ఈ ఘటనపై హాస్టల్ విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో ఉన్నా రక్షణ లేకుండా పోయిందని మహిళా సంఘాలు విమర్శించాయి. నిందితులను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. హాస్టల్ సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బయట వ్యక్తులు అమ్మాయిల హాస్టల్‌లోకి చొరబడుతుంటే.. సిబ్బంది ఏం చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
బాలికపై అత్యాచారయత్నం..
బాలికపై అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదోని పట్టణంలోని వాల్మీకి నగర్‌కు చెందిన శ్రీరాములు అనే వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు.. కర్నూలు ఒకటో పట్టణ సీఐ శ్రీరామ్ తెలిపారు. కొండ ప్రాంతంలో పనులకు వెళ్లిన 11 ఏళ్ల బాలికపై శ్రీరాములు అత్యాచారానికి యత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులకు అక్కడికి చేరుకున్నారు.
నిందితుడు శ్రీరాములు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. దీనిపై సీఐ శ్రీరామ్ స్పందిస్తూ.. కేసు దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని, పోక్సో కేసు అయినందున డీఎస్పీ దర్యాప్తు చేస్తారని స్పష్టం చేశారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్