



Best Web Hosting Provider In India 2024
సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలి – స్థానిక ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు
స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశింది. 30 రోజుల్లో వార్డుల విభజన పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికలపైరాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎన్నికల నిర్వహణపై దాఖలైన పిటిషన్లపై విచారించిన న్యాయస్థానం… గ్రామ పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని ఆదేశించింది. 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం తీర్పును వెలువరించింది.
3 నెలల్లో ఎన్నికలు జరపాలి – హైకోర్టు
స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు పూర్తి చేసేందుకు 30 రోజుల గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. అయితే రిజర్వేషన్లు పూర్తయ్యాక 60 రోజుల సమయం కావాలని ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు కోరారు. ప్రభుత్వంతో పాటు ఎన్నికల సంఘం అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న ఉన్నత న్యాయస్థానం…. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు జరపాలని ఆదేశించింది. అంటే స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియ వచ్చే మూడు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉంది.
రాష్ట్రంలో గతేడాది జనవరి 31వ తేదీతో సర్పంచ్ ల పదవీ కాలం గడువు ముగిసింది. దీంతో ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణ కోసం పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వీటన్నింటిని కలిపి హైకోర్టు విచారణ చేపట్టింది.
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ…. సర్పంచ్ ల పదవీకాలం ముగిసిపోయి.. చాలా రోజులవుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇది రాజ్యాంగ, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధమని వాదించారు. ప్రత్యేక అధికారులు ఇతర విధుల్లో ఉండటంతో ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదని చెప్పుకొచ్చారు. ప్రత్యేకాధికారుల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ప్రస్తావించారు. వెంటనే ఎన్నికలను నిర్వహించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. బీసీ రిజర్వేషన్ల ఖరారు చేసే విషయంపై కసరత్తు కొనసాగుతోందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ప్రస్తావించారు. మరో నెల రోజుల సమయం పడుతోందని వాదనలు వినిపించారు. మరోవైపు ఈసీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం…. మూడు నెలలలోపు ఎన్నికలను నిర్వహించాలని ఆదేశిస్తూ తీర్పును వెలువరించింది. దీంతో… గ్రామ పంచాయతీల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది.
టాపిక్