



Best Web Hosting Provider In India 2024

వర్షాకాలంలో తలకి నూనె రాస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే శిరోజాలకు ఇన్ఫెక్షన్లు రావచ్చు
వర్షాకాలంలో జుట్టుకు నూనె రాసే విషయంలో కొన్ని సాధారణ పొరపాట్లు జుట్టు సమస్యలకు, ముఖ్యంగా మీ తలపై చర్మం ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మీ శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జుట్టుకు నూనె రాసే సరైన పద్ధతిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. నూనె రాసే పద్ధతి, ఎంత తరచుగా రాయాలి వంటి విషయాలకు సంబంధించి ఇక్కడ కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి.
సాధారణంగా, తలకి నూనె రాయడం అనేది జుట్టు సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు. కానీ ఈ ఇష్టమైన అలవాటును సరిగ్గా చేయకపోతే, అది జుట్టుకి సంబంధించిన పీడకలగా, డాక్టర్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితిగా మారవచ్చు. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి, మనందరికీ ఇష్టమైన వర్షాకాలం. వాతావరణంలో తేమ శాతం పెరగడం వల్ల తల చర్మానికి కొత్త సవాళ్లు ఎదురవుతాయి. ఇది సాధారణం కంటే ఎక్కువ జిడ్డుగా మారే అవకాశం ఉంటుంది.
కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్, ఈడెన్ స్కిన్ క్లినిక్ వ్యవస్థాపకురాలు డాక్టర్ అమీషా మహాజన్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌తో మాట్లాడుతూ, వర్షాకాలంలో సాధారణంగా నూనె రాయడం వల్ల కూడా శిరోజాల సమస్యలు ఎలా పెరుగుతాయో వివరించారు.
“వర్షాకాలంలో తలకి నూనె రాసి, దాన్ని ఎక్కువసేపు, ముఖ్యంగా రాత్రంతా అలాగే ఉంచితే అది రివర్స్ ఎఫెక్ట్ ఇవ్వొచ్చు. గాలిలో అధిక తేమ జుట్టులో నిలిచిపోయి, మీ తలపై చర్మం (మాడు) ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. లేదా వెంట్రుకల కుదుళ్లకు అడ్డుపడే అవకాశం ఉంది. అదేవిధంగా, చెమట పట్టిన లేదా శుభ్రంగా లేని తల చర్మంపై నూనె రాయడం వల్ల ఫంగల్, బ్యాక్టీరియా సమస్యలకు ఆస్కారం ఏర్పడుతుంది” అని అమీషా తెలిపారు.
అయితే, దీని అర్థం జుట్టుకు నూనె రాయడం పూర్తిగా మానేయాలా? అస్సలు కాదు. దాన్ని సరైన పద్ధతిలో ఎలా చేయాలో అర్థం చేసుకోవడం అవసరం.
“జుట్టుకు నూనె రాయడం వల్ల శిరోజాలకు పోషణ అందుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వెంట్రుకల కుదుళ్లు బలోపేతం అవుతాయి. వాస్తవానికి, వర్షాకాలంలో తరచుగా షాంపూ చేయడం వల్ల శిరోజాలు పొడిబారడం, లేదా తేమతో కూడిన వాతావరణంలో ఫంగల్ వృద్ధి కారణంగా పొలుసులు, చుండ్రు ఏర్పడటం వంటివి జరుగుతాయి. ఇలాంటి సమయంలో నూనె రాయడం మరింత కీలకం అవుతుంది. మంచి ఆయిల్ మసాజ్ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది జుట్టు రాలడానికి ఒక కనిపించని కారణం. వర్షాకాలంలో జుట్టుకు నూనె రాయడం సరైనదే. అయితే మీరు తెలుసుకోవలసిందల్లా సరైన పద్ధతి. తద్వారా హాని కంటే ఎక్కువ ప్రయోజనాలు చేకూరుతాయి. తేలికపాటి నూనెను ఉపయోగించండి. ఎక్కువసేపు అలాగే వదిలేయకుండా నూనె రాసిన తర్వాత, మీ జుట్టును సరిగ్గా కడగాలి” అని వివరించారు.
డాక్టర్ అమీషా మహాజన్ పంచుకున్న ముఖ్యమైన చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:
వర్షాకాలంలో మీ జుట్టుకు నూనె రాసే సరైన 6 చిట్కాలు:
1. తేలికపాటి నూనెను ఎంచుకోండి: కొబ్బరి, జోజోబా, లేదా ఆర్గాన్ ఆయిల్ వంటి తేలికపాటి, జిడ్డు లేని నూనెను ఎంచుకోండి. తేమతో కూడిన నెలల్లో ఆముదం వంటి బరువైన నూనెలను నివారించండి.
2. నూనెను కొద్దిగా వేడి చేయండి: రాసే ముందు నూనెను కొద్దిగా వేడి చేయండి. ఇది నూనె లోపలికి బాగా చొచ్చుకుపోవడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
3. శుభ్రమైన, పొడి శిరోజాలపై రాయండి: ఎప్పుడూ చెమట పట్టిన లేదా మురికిగా ఉన్న తల చర్మంపై నూనె రాయవద్దు.
4. మెల్లగా మసాజ్ చేయండి: జుట్టు తెగిపోకుండా, వేళ్ళ చివరలతో వృత్తాకార కదలికలలో సున్నితంగా మసాజ్ చేయండి.
5. ఎక్కువసేపు ఉంచవద్దు: నూనెను కేవలం 30 నిమిషాల నుండి 1 గంట వరకు మాత్రమే ఉంచండి. శిరోజాలకు పోషణ అందించడానికి ఇది సరిపోతుంది.
6. సల్ఫేట్ లేని షాంపూతో కడగండి: నూనెను పూర్తిగా తొలగించడానికి సల్ఫేట్ లేని, సున్నితమైన షాంపూతో కడగండి. నూనెను కడగడానికి వేడి నీటిని ఉపయోగించవద్దు.
వర్షాకాలంలో ఎన్నిరోజులకోసారి నూనె పెట్టుకోవాలి?
వర్షాకాలంలో వారానికి రెండుసార్లు నూనె రాయడం సరిపోతుంది. అధికంగా నూనె రాయడం వల్ల జుట్టు నిస్సారంగా, జిడ్డుగా మారవచ్చు. చుండ్రు పెరగొచ్చు. మీకు ఇన్ఫెక్షన్లు ఉంటే, నూనె రాయడానికి ముందు డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.
(పాఠకులకు గమనిక: ఈ వ్యాసం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా వైద్య పరిస్థితి గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ వైద్యుడి సలహా తీసుకోండి.)