Best Web Hosting Provider In India 2024
AP Police Recruitment 2024 : రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు కసరత్తు ప్రారంభమైంది. ఆగస్టు నెల ఆఖరు లోగే షెడ్యూల్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు, పోలీసు నియామక మండలి చైర్మన్ పీహెచ్‌డీ రామకృష్ణ పలుమార్లు సమావేశమై కానిస్టేబుల్స్ నియామకంపై చర్చించారు.
పోలీస్ కానిస్టేబుల్స్ నియామకానికి గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌పై కోర్టుల్లో కేసులు దాఖలై ఉన్నందున వాటిపై న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తరువాత కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆగస్టు నెలాఖరులోగా నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు షెడ్యూల్ ఖరారు అయ్యే అవకాశం ఉంది.
గత వైసీపీ ప్రభుత్వం 2022 నవంబర్ 28న పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే దీనిపై కోర్టులో కేసులు వేశారు. అయినప్పటికీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అలాగే ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. ఆ తరువాత నిర్వహించాల్సిన మెయిన్స్ రాత పరీక్ష జరగలేదు. ఈలోపు రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైంది. అంతే వాటికి అతీలేదు, గతీలేకుండా పోయింది.
పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్ష 2023 జనవరి 22న జరిగింది. ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 4,58,219 మంది హాజరయ్యారు. ఫిబ్రవరి 5న పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 95,208 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. వీరికి దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
అయితే 2023 మార్చి 13 నుంచి 20 వరకు దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహిస్తామని షెడ్యూల్ విడుదల చేశారు. దీనికి సంబంధించి హాల్ టికెట్లు కూడా జారీ చేశారు. అయితే సరిగ్గా అప్పుడే రాష్ట్రంలో గ్రాడ్యూట్ (పట్టభద్రుల) ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలు వచ్చాయి. దీంతో ఆ పరీక్షలను వాయిదా వేసింది. అయితే అప్పటి నుంచి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎదురు చూస్తునే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా పోలీస్‌కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి స్పందించారు. త్వరలోనే పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని ఆయన తెలిపారు.
రిపోర్టింగ్ – జగదీశ్వరరావు జరజాపు,హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
టాపిక్