Best Web Hosting Provider In India 2024
Brinda Review: అగ్ర హీరోయిన్ త్రిష (Trisha) బృంద వెబ్‌సిరీస్ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సిరీస్‌కు సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించాడు. రవీంద్ర విజయ్, ఇంద్రజీత్, ఆమని కీలక పాత్రలు పోషించారు. సోనీ లివ్ ఓటీటీలో (Sony Liv OTT) రిలీజైన ఈ వెబ్‌సిరీస్‌తో త్రిష తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించిందా? ఓటీటీలో ఎంట్రీతోనే హిట్టు అందుకుందా? లేదా? అంటే?
బృంద అన్వేషణ…
బృంద (త్రిష) హైదరాబాద్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా కొత్తగా ఉద్యోగంలో చేరుతుంది. ఆ స్టేషన్‌లో పనిచేసే సీఐ సాల్మన్‌తో పాటు మిగిలిన సిబ్బందికి బృంద పనితీరుపై అంతగా నమ్మకం ఉండదు. ఆమెను పట్టించుకోనట్లుగా ఉంటారు. ఓ రోజు పోలీసులకు గుర్తు తెలియని మృతదేహం దొరుకుతుంది. అది రైల్వే ఎంప్లాయ్ తిలక్ డెడ్‌బాడీగా బృంద కనిపెడుతుంది.
అదే స్టేషన్‌లో పనిచేసే సారథికి (రవీంద్ర విజయ్) బృంద తెలివితేటలపై నమ్మకం ఏర్పడుతుంది. తిలక్ హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును క్లోజ్ చేయమని సీఐ సాల్మన్ ఆర్డర్ వేస్తాడు. కానీ అతడి మాటలు లెక్కచేయకుండా బృంద ఇన్వేస్టిగేషన్ చేస్తుంది, తిలక్ మాదిరిగానే రాష్ట్రంలో కొన్ని ఏళ్లుగా ఒకే తరహాలో ఓ సీరియల్ కిల్లర్ హత్యలకు పాల్పడుతున్నాడని బృంద అన్వేషణలో తెలుస్తుంది.
ఆ కిల్లర్‌ను పట్టుకోవడానికి ఏసీపీ సిట్ టీమ్‌ను ఏర్పాటుచేస్తాడు. సారథి పట్టుపట్టి బృందను టీమ్‌ను జాయిన్ అయ్యేలా చేస్తాడు. ఒక్కో క్లూ సేకరించిన కొద్ది ఆ కిల్లర్‌కు సంబంధించి విస్తుపోయే నిజాలు బృంద, సారథిల ద్వారా బయటపడుతుంటాయి. దేవుడిని విశ్వసించే వాళ్లను టార్గెట్ చేస్తోన్న ఆ కిల్లర్ సాముహిక హత్యలకు పాల్పడుతున్నాడని తెలుసుకుంటారు.
ఈ హత్యలకు పాల్పడుతుందని ఠాకూర్ అని బృంద కనిపెడుతుంది? అసలు ఈ హత్యలు ఠాకూర్ ఎందుకు చేస్తున్నాడు? అతడితో ఈ హత్యలు చేయిస్తున్నది ఎవరు? ఈ కిల్లర్ వెనుక సంఘ సంస్కర్త కబీర్ ఆనంద్ (ఇంద్రజీత్) ఉన్నాడని బృంద అనుమానించడానికి కారణం ఏమిటి? చిన్నప్పుడే తల్లితో పాటు అన్నయ్య సత్యకు బృంద ఎలా దూరమైంది? బృందను పెంచి పెద్ద చేసిన పోలీస్ ఆఫీసర్ రఘు (జయప్రకాష్) ప్రాణాలు ఎలా పోయాయి? కబీర్ ఆనంద్, సత్య కు ఉన్న సంబంధం ఏమిటి? తన అన్నయ్యను బృంద కలుసుకుందా? లేదా? అన్నదే ఈ వెబ్‌సిరీస్ కథ(Brinda Review).
క్రైమ్ ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్…
వెబ్ సిరీస్‌లలో మిగిలిన జోనర్స్‌తో పోలిస్తే క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ కథలే ఎక్కువగా సక్సెస్ అయినా దాఖలాలు ఉన్నాయి. సినిమాల్లో కొన్ని క్రైమ్ థ్రిల్లర్ కథలను చెప్పడానికి నిడివి అడ్డంకిగా ఉంటుంది. అలాంటి కథలను వెబ్‌సిరీస్ ద్వారా దర్శకులు చెబుతోన్నారు. బృంద(Brinda Review) అలాంటి కథనే.
పోలీస్ ఉద్యోగానికి పనికిరాదని అవహేళన చేసిన వారి చేత శభాష్ అనిపించుకున్న ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ జర్నీతో బృంద కథను రాసుకున్నాడు దర్శకుడు. మతం, మూఢనమ్మకాల కారణంగా సొసైటీలో అన్యాయాలకు గురైన కొందరు ఎలాంటి పరిస్థితుల్లో కిల్లర్స్‌గా మారుతున్నారు? వారి జీవితాల్లో ఎలాంటి చీకటి కోణాలు దాగిఉన్నాయన్నది ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో చూపించారు. క్రైమ్ పాయింట్‌కు పరిమితం కాకుండా మల్టీ లేయర్స్‌తో చివరి సీన్ వరకు థ్రిల్లింగ్‌గా సిరీస్‌ను నడిపించారు డైరెక్టర్.
తండ్రీ కూతురు, భార్యభర్తల అనుబంధంతో పాటు ఉన్నతాధికారుల ఒత్తిళ్లు, వృత్తి బాధ్యతలకు మధ్య నలిగిపోయే కిందిస్థాయి పోలీస్ ఆఫీసర్ల సంఘర్షణను సహజంగా ఈ సిరీస్‌లో ఆవిష్కరించారు.
బృంద పాత్ర ఎంట్రీ తర్వాతే…
గంగవరం అనే ఫారెస్ట్ లో 1996 టైమ్‌లో బృంద కథను ఆరంభమైనట్లుగా చూపించి ఓపెనింగ్ సీన్‌తోనే దర్శకుడు సిరీస్‌పై క్యూరియాసిటీ కలిగించాడు. ఆ తర్వాత బృంద పాత్ర ఎంట్రీ…పోలీస్ స్టేషన్‌లో ఆమెకు ఎదురయ్యే అవహేళనలతో ఫస్ట్ ఎపిసోడ్ సాగుతుంది. తిలక్ హత్య గురించి బృంద(Brinda Review) ఇన్వేస్టిగేషన్ మొదలుపెట్టినప్పటి నుంచే కథ పరుగులు పెడుతుంది.
ఆ తర్వాత ఠాకూర్ హత్యలు చేస్తోన్నట్లుగా త్రిష, సారథి కనిపెట్టడం, అతడి నేపథ్యం ద్వారా ప్రజల్లో పేరుకు పోయిన మూఢనమ్మకాల గురించి చెప్పే సీన్స్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తాయి. బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ చూపిస్తూ చివరి వరకు సిరీస్‌ను నడిపించాడు.
సత్య, ఠాకూర్ పరిచయం వారు కిల్లర్స్‌గా మారడానికి కారణమైన పరిస్థితుల్లోని. డైలాగ్స్ ఆలోచనను రేకెత్తిస్తాయి. చివరలో సత్య పాత్రకు సంబంధించి వచ్చే మలుపు, బృందతో అతడికి ఉన్న రిలేషన్ ఏమిటన్నది రివీలయ్యే సీన్ ఆకట్టుకుంటుంది.
బ్యాక్‌డ్రాప్ కొత్తదే కానీ…
సిరీస్ బ్యాక్‌డ్రాప్, పాయింట్ కొత్తగా ఉన్నాయి. కానీ త్రిష కేసు ఇన్వేస్టిగేషన్‌లో కిల్లర్ గురించి ఆధారాలు సేకరించే సీన్స్ కొన్ని లాజిక్‌లకు దూరంగా సాగుతాయి. ఆమె చుట్టూ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ చిన్న చిన్న క్లూలు కూడా కనిపెట్టలేనివారిగా చూపించడం అంతగా ఆకట్టుకోదు.
ఎనిమిది ఎపిసోడ్స్…
మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఈ సీరిస్(Brinda Review) సాగుతుంది. కొన్ని ఎపిసోడ్స్ సాగదీసినట్లుగా అనిపిస్తాయి. సత్య ఠాకూర్ పరిచయం, జువైనల్ హోమ్ సీన్స్‌తో పాటు రఘు సత్య ట్రాక్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. త్రిష చెల్లెలి ఎపిసోడ్ కథకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా అనిపిస్తుంది.
సీరియస్ రోల్‌లో…
పోలీస్ ఆఫీసర్‌గా త్రిష యాక్టింగ్ బాగుంది. సిరీస్ మొత్తం సీరియస్‌గా కనిపిస్తూ సెటిల్డ్ యాక్టింగ్ కనబరిచింది. తన యాక్టింగ్‌తో క్లైమాక్స్‌ను నిలబెట్టింది. సారథిగా త్రిషతో పాటు సమానంగా కనిపించే రోల్‌లో రవీంద్ర విజయ్ నాచురల్ యాక్టింగ్ కనబరిచాడు. సగటు పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు. ఠాకూర్ పాత్రలో ఆనంద్ సమీ తన ఆహార్యం, విలనిజంతో భయపెట్టాడు. ఇంద్రజీత్, జయప్రకాష్, ఆమని, రాకేందు మౌళి, యశ్న ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. బీజీఎమ్ , టైటిల్ సాంగ్ బాగున్నాయి.
చివరి వరకు థ్రిల్లింగ్…
బృంద(Brinda Review) స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు థ్రిల్లింగ్‌ను పంచే మంచి క్రైమ్ ఇన్వేస్టిగేషన్ సిరీస్. త్రిష యాక్టింగ్, డైరెక్టర్ టేకింగ్ కోసం ఈ సీరిస్‌ను చూడొచ్చు.
రేటింగ్: 3/5