Best Web Hosting Provider In India 2024
Guppedantha Manasu August 2nd Episode: డీబీఎస్‌టీ కాలేజీలోకి రంగా సడెన్ ఎంట్రీ ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తాడు శైలేంద్ర. కానీ రంగా ప్లేస్‌లో వసుధార రావడం చూసి కళ్లు తిరిగిపడిపోతాడు. ఆ తర్వాత రిషి కూడా కాలేజీలోకి స్టైలిష్‌గా రంగప్రవేశం చేస్తాడు. అతడు రిషినో, రంగానో అర్థం కాక శైలేంద్ర, దేవయాని కన్ఫ్యూజన్‌లో పడిపోతారు. తాను రంగానేనని శైలేంద్రను నమ్మిస్తాడు రిషి.
మహేంద్ర నిర్ణయం…
రిషి, వసుధారలను తీసుకొని తన ఇంటికి వెళ్లిపోతానని మహేంద్ర అంటాడు. అందుకు ఫణీంద్రతో పాటు దేవయాని ఒప్పుకోరు. తమ ఇంట్లోనే వారిని ఉండిపోవాలని పట్టుపడతారు. చాలా రోజుల తర్వాత వసుధార, రిషి మళ్లీ కలుసుకున్నారని, వాళ్లకు ప్రైవసీ ఇవ్వడానికైనా మా ఇంటికి వెళ్లిపోవడం కరెక్ట్ అని అనుకుంటున్నట్లు మహేంద్ర సమాధానమిస్తాడు. ఫణీంద్ర బలవంతం మేరకు ఒక్కరోజు అతడి ఇంట్లో ఉండటానికి మహేంద్ర, రిషి అంగీకరిస్తారు.
వసుధార డిన్నర్ చేయడానికి వెళుతూ రిషిని పిలుస్తుంది. కానీ వసుధార వెంట వెళ్లడానికి రిషి ఇష్టపడనట్లుగా శైలేంద్ర ముందు నటిస్తాడు. శైలేంద్ర బలవంతంగా అతడిని పంపిస్తాడు.
రిషి, వసుధారలను చూసి మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. తమను వదిలిపెట్టి ఎలా దూరంగా వెళ్లావు…మమ్మల్ని వదిలిపెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందని కొడుకును నిలదీస్తాడు. వసుధార నీ కోసం ఎంత పరితపించిందో తెలుసా…ఎంత బాధ అనుభవించిందో తెలుసా అని అడుగుతాడు. క్షణక్షణం నిన్ను తలుచుకుంటూ మేము నరకం అనుభవించావని కన్నీళ్లు పెట్టుకుంటాడు. నువ్వు చనిపోయావని మేమంతా నమ్మిన వసుధార నమ్మకుండా అందరితో పోరాడిందని మహేంద్ర వివరిస్తాడు.
శైలేంద్ర అనుమానం…
రిషి అడ్రెస్ ఎలా కనిపెట్టావని వసుధారను అడుగుతాడు శైలేంద్ర. మన కాలేజీని గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకుంటుందని తెలిసి అడ్డుకోవడానికి వస్తే తనకు రిషి కనిపించాడని, అతడిని తీసుకొచ్చి అందరికి పరిచయం చేశానని వసుధార అబద్ధం ఆడుతుంది. రిషి చెప్పిన కథ…వసుధార పొల్లు పొకుండా చెప్పడం చూసి నిజమని శైలేంద్ర నమ్ముతాడు.
దేవయాని ఫైర్…
వసుధారను చంపానని తన దగ్గర అబద్ధం ఆడిన కొడుకు శైలేంద్ర చెంపలు వాయిస్తుంది దేవయాని. ఎన్ని కొట్టిన శైలేంద్ర మాత్రం ఉలుకుపలుకు లేకుండా ఉంటాడు. వసుధారను చంపానని తనకు పాండు అబద్ధం చెప్పాడని తల్లితో అంటాడు శైలేంద్ర. నువ్వు చేసిన మిస్టేక్ వల్ల మనం పెద్ద సమస్యలో పడ్డామని కొడుకుకు క్లాస్ ఇస్తుంది. వసుధార చనిపోయిందనుకొని రంగాను రిషిగా నాటకం ఆడటానికి తీసుకొచ్చామని, ఈ విషయం వసుధార కనిపెడితే మన నిజ స్వరూపం మొత్తం బయటపడటం ఖాయమని అంటుంది.
వసుధార పేరు తలచుకున్న ప్రతిసారి దేవయాని వణికిపోతుంటుంది. వసుధారకు భయపడాల్సిన పనిలేదని, మన ప్లాన్ ఫెయిలైతే నేనైనా చచ్చిపోతా…అవసరమైతే ఆ కుటుంబం మొత్తాన్ని లేపేస్తానని శైలేంద్ర చెబుతాడు. వసుధారతో కలిసి భోజనం చేయడానికి దేవయాని అంగీకరించదు. ఫణీంద్ర అనుమానపడతాడని శైలేంద్ర బలవంతంగా తల్లిని డిన్నర్ చేయడానికి తీసుకెళతాడు.
రిషి నాటకం…
డిన్నర్ చేసే టైమ్‌లో రిషికి దగ్గరకు జరుగుతుంది వసుధార. అది శైలేంద్ర గమనిస్తాడు. వసుధార కారణంగా తాను ఇబ్బందిపడుతున్నట్లుగా శైలేంద్రకు కావాలనే హింట్ ఇస్తాడు రిషి. నాటకాన్ని కంటిన్యూ చేయమని శైలేంద్ర బతిమిలాడుతాడు. రిషికి పొలమారడంతో వసుధార నీళ్లు తాగిస్తుంది. అది చూసి దేవయానిలో అనుమానం మొదలవుతుంది. అన్ని తెలివితేటలు ఉన్న వసుధార…రంగాను ఎందుకు గుర్తుపట్టలేకపోతుందని కొడుకును అడుగుతుంది. నిజంగా అతడు రిషి అయితే నీతో పాటు నాకు మూడినట్లేనని దేవయాని భయంగా కొడుకుతో చెబుతుంది. వారిద్దరు సీక్రెట్‌గా మాట్లాడుకోవడం చూసి ఫణీంద్ర ఫైర్ అవుతాడు.
నోరుజారిన శైలేంద్ర…
చాలా రోజుల తర్వాత రంగా మన ఇంటికి వచ్చాడు కదా దాని గురించే అంటూ శైలేంద్ర నోరు జారుతాడు.రంగా ఎవరు అని కొడుకును అడుగుతాడు ఫణీంద్ర. ఆ ప్రశ్నకు తడబడిపోతాడు శైలేంద్ర.రిషి అనబోయి రంగా అన్నానని మాట మార్చేస్తాడు. మహేంద్ర, రిషి, వసుధార మన ఇంట్లోనే ఉంటే బాగుంటుందని , అందరం కలిసే ఉందామని తండ్రితో అంటాడు శైలేంద్ర. రిషి కూడా…మనం ఇక్కడే ఉందామని మహేంద్రకు చెబుతాడు. కానీ వసుధార మాత్రం వినదు. మన ఇంటికి వెళ్లిపోదామని చెబుతుంది. వసుధార మా ఇంటి దీపమని, ఆమె ఏం చెబితే అలాగే చేస్తానని మహేంద్ర అంటాడు.
వసు గుండెచప్పుడు రిషినే…
వసుధార మిస్సయిన తర్వాత తాను ఎదుర్కొన్న బాధ, ఆవేదనను కవితాత్మకంగా చెబుతాడు రిషి. వసుధార కూడా తన ఆవేదనను బయటపెడుతుంది. నా గుండెచప్పుడు, అణువుఅణువు మీరేనని భర్తతో అంటుంది. చందమామలో తనకు జగతి అత్తయ్య కనిపిస్తుందని వసుధార అంటుంది. నాకు కూడా జగతిని చూపిస్తావా అని అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన మహేంద్ర అడుగుతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.